29, ఏప్రిల్ 2012, ఆదివారం

తోమని పళ్ళాల వాడే వేంకటేసుడు


వేడుకుందామా వేంకటగిరి వేంకటేశ్వరుని ||

ఆపద మ్రొక్కుల వాడే ఆది దేవుడే వాడు
తోమని పళ్యాల వాడే దురిత దూరుడే ||

వడ్డి కాసుల వాడే వనజ నాభుడే
పుట్టు  గొడ్రాండ్రకు బిడ్డలిచ్చే గోవిందుడే ||

ఎలమి కోరిన వరాలిచ్చే దేవుడే
వాడు, అలమేల్మంగా వేంకటాద్రి నాథుడే ||
   
తిరుమలలో కొత్త కుండని పగలగొట్టి, ఆ కుండ పెంకులో, ప్రతిరోజు మధ్యాహ్నం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవేంకటేశ్వరస్వామి కి ప్రసాదం నివేదిస్తారు. కుమ్మర దాసుడైన కురువరత్తి నంబి భక్తికి శ్రీనివాసుడు ముగ్ధుడై, అతను కుండ పెంకులో నివేదించిన ప్రసాదాన్ని  స్వీకరిస్తాడు. 

అందుకే తిరుమలలో కుండ పెంకులో ప్రతిరోజు మధ్యాహ్నం స్వామివారికి ప్రసాదం నివేదిస్తారు.

అందుకే అన్నమాచార్యులు కీర్తనలో తోమని పళ్యాల వాడే అని కీర్తించారు.

6, ఫిబ్రవరి 2012, సోమవారం

శ్రీత్రివిక్రమ పెరుమాళ్ ఆలయం తిరుక్కోవిలూర్


శ్రీకృష్ణ పరమాత్మ కొలువుదీరిన పంచ కృష్ణ క్షేత్రాలలో తిరుక్కోవిలూర్ ఒకటి. ఇక్కడ శ్రీమన్నారాయణుడు శ్రీత్రివిక్రమ పెరుమాళ్ గా కొలువుదీరి ఉన్నాడు.

ఇక్కడే కొలువుదీరిన శ్రీమన్నారాయణుడిని, మృఖండ  మహర్షి శ్రీత్రివిక్రమ పెరుమాళ్ గా పూజించాడని ప్రతీతి.  
శ్రీవైష్ణవులకు పరమపవిత్రమైన 108 దివ్యదేశాలలో,  శ్రీత్రివిక్రమ పెరుమాళ్  ఆలయం కూడా ఒకటి.   

ఈ ఆలయం చోళ రాజైన పరాంతక చోళచే నిర్మించబడి ,రాజ రాజ చోళ I , రాజ రాజ చోళ II మరియు రాజేంద్ర దేవ చోళచే విశేషంగా అభివృధ్ధి చేయబడింది. 

శ్రీత్రివిక్రమ పెరుమాళ్  చతుర్భాహువులతో,  కుడి చేతిలో శంఖు, ఎడమ చేతిలో చక్రం ధరించి, కుడి కాలు ఆకాశం పైన పెట్టి, కుడి చేతి చూపుడు వేలుతో 1 అని చూపిస్తూ నయనమనోహరంగా దర్శనమిస్తారు. ఈ ఆలయంలో శ్రీమహాలక్ష్మి పుష్పవల్లిగా కొలువుదీరి ఉంది. 


ఇక్కడే కొలువుదీరిన లక్ష్మినారాయణ, లక్ష్మినరసింహ, ఆండాళ్,  ఉదయవర్,  చక్రత్తాళ్వర్, వరదరాజ, వేణుగోపాల మరియు శ్రీరాముడిని దర్శించవచ్చు. ఈ ఆలయంలో  శ్రీత్రివిక్రమ పెరుమాళ్ అర్చా రూపం వెనక ఉన్న చిన్న వామనమూర్తి కూడా ఉన్నారు. 

ఇక్కడే కొలువైన    శ్రీత్రివిక్రమ పెరుమాళ్  ఉత్సవమూర్తి కి గోపాలుడు అని పేరు.     

నాదముని నాలాయిర  దివ్య ఫ్రభంధం  లేక ద్రవిడ వేదం ని ప్రపంచానికి మొట్టమొదటిసారి యిక్కడినుంచే తెలియచేసాడని ప్రతీతి.   

ఈ ఆలయంలో వైకుంఠ ఏకాదశి మరియు వార్షిక బ్రహ్మోత్సవం విశేషంగా జరుగుతుంది.          

5, ఫిబ్రవరి 2012, ఆదివారం

శ్రీకృష్ణ పరమాత్మ కొలువుదీరిన పంచ కృష్ణ క్షేత్రాలు


పంచ కృష్ణ క్షేత్రాలులో శ్రీకృష్ణ పరమాత్మ   కొలువై ఉన్నాడు.
శ్రీవైష్ణవులకు పరమపవిత్రమైన 108 దివ్యదేశాలలో,    పంచ కృష్ణ క్షేత్రాలు  కూడా ఉన్నాయి.
తిరుక్కోవిలూర్ లో  శ్రీత్రివిక్రమ (ఉలగళంద/వామన) పెరుమాళ్ గా కొలువుదీరి ఉన్నారు.
తిరుకణ్ణపురంలో శౌరిరాజన్ నీలమేఘ పెరుమాళ్ గా కొలువుదీరి ఉన్నారు.
తిరుకణ్ణన్ కుడిలో  శ్రీలోకనాధ్  పెరుమాళ్ గా కొలువుదీరి ఉన్నారు.
తిరుకణ్ణమంగైలో శ్రీభక్తవత్సల పెరుమాళ్ గా కొలువుదీరి ఉన్నారు.
తిరుకణ్ణన్ కపిస్థలంలో శ్రీగజేంద్ర వరదార్  పెరుమాళ్ గా కొలువుదీరి ఉన్నారు
పంచ కృష్ణ క్షేత్రాలు తమిళనాడు రాష్ట్రంలో ఉన్నాయి.