24, జనవరి 2012, మంగళవారం

శ్రీవైకుంఠ పెరుమాళ్ ఆలయం కాంచీపురం


కాంచీపురంలో ఉన్న వైష్ణవ ఆలయాలలో శ్రీవైకుంఠ పెరుమాళ్ ఆలయం అత్యంత విశిష్టమైనది. శ్రీవైకుంఠ పెరుమాళ్ ఆలయంలో శ్రీమన్నారాయణుడు అర్చామూర్తి రూపంలో కొలువుదీరి ఉన్నాడు.   

ఈ ఆలయాన్ని పల్లవ రాజైన నందివర్మన్ నిర్మించాడు. ఈ ఆలయానికి పరమేశ్వర విష్ణుగృహ అని కూడా పేరు.  ఆలయ ముఖద్వారంపై వినమ్రంగా  ముకుళిత హస్తాలతో గరుడాళ్వార్ దర్శనమిస్తారు. ఆలయ గోడలపై చెక్కిన చిత్రాలు చోళులు మరియు పల్లవుల యుద్ధగాధని కళ్ళ ముందు సాక్షాత్కరిస్తాయి. 

స్ధంభాలలో ఠీవిగా కొలువుదీరిన మృగరాజులు  చూపరులను విశేషంగా ఆకర్షిస్తాయి.  ఈ ఆలయ  నిర్మాణశైలి చాలా విశిష్టంగా ఉంది. 

శ్రీమహావిష్ణువు వివిధరూపాలలో దర్శమిస్తారు. శ్రీమహావిష్ణువుని కూర్చొని, నిలబడి, యోగనిద్రలో  కొలువుదీరిన అర్చారూపాలు నయనమనోహరంగా దర్శమిస్తాయి. ఇదే ఆలయంలో కొలువుదీరిన శ్రీమహాలక్ష్మిని కూడా దర్శించవచ్చు.   ఈ ఆలయ ప్రదక్షిణ మార్గంలో ఉన్న స్ధంభాలు, గోడలపై కొలువుదీరిన శిల్పాలు నయనమనోహరంగా ఉన్నాయి.  ఆలయ ప్రాంగణంలో విశాలమైన  కోనేరు ఉంది.

శ్రీవైష్ణవులకు పరమపవిత్రమన 108 దివ్యదేశాలలో శ్రీవైకుంఠ పెరుమాళ్ ఆలయం ఒకటి. తిరుమంగై ఆళ్వార్  శ్రీవైకుంఠ పెరుమాళ్ ఆలయాన్ని దర్శించి మంగళాశాసనం చేసారు.             

20, జనవరి 2012, శుక్రవారం

శ్రీకైలాసనాథార్ దేవాలయం కాంచీపురం


పరమేశ్వరుడు కాంచీపురంలో కొలువుదీరిన సుప్రసిద్దమైన  దేవాలయాలలో  కైలాసనాథార్ దేవాలయం అత్యంత విశిష్టమైనది . 

కైలాసనాథార్ దేవాలయ ప్రాంగణం చాలా విశాలంగా, ప్రశాంత వాతవరణంలో  నెలకొనిఉంది.  ఈ దేవాలయం దేవశిల్పి  విశ్వకర్మే స్వయంగా పరమశివుడు కొలువుదీరటానికి నిర్మించాడేమో అన్నట్లు అసమాన శిల్పకళా సౌందర్యంతో అలరారుతుంది. శిల్ప సౌందర్యాన్ని రాశిగా పోస్తే ,అది  కైలాసనాథార్ దేవాలయం అంటే అతిశయోక్తి  కాదేమో.


లయ ప్రాంగణంలో శిల్పాలు  నయనమనోహరంగా ఉంటాయి.      ప్రాంగణం  లో ఉన్న శిల్పాలు సైకత శిల్పాలు. దేవాలయ ప్రాంగణంలో గోడలపై కొలువుదీరిన "శివలీలలు"  ఆనందసాగరంలో ఓలలాడిస్తాయి.  ఈ దేవాలయం 8వ శతాబ్ధంలో నిర్మించినప్పటికి,  యీ  అపురూప శిల్పాలు  యిప్పటికి చెక్కుచెదరకుండా నిలచిఉండటం, ఆకాలంలో శిల్పుల కళా నైపుణ్యానికి, శాస్త్ర విజ్ఞానానికి, కళా వైభవానికి ప్రతీకలు . కైలాసనాథార్ దేవాలయం కాంచీపురం సిగలో పల్లవులచే తురమబడిన కలికితురాయి.


పల్లవ రాజైన రాజసింహ   కైలాసనాథార్ దేవాలయం నిర్మించారు. ఈ దేవాలయం  ద్రావిడ శైలిలో  నిర్మించబడింది.  


రాజరాజ చోళ కైలాసనాథార్ దేవాలయం దర్శించి, అత్యంత ముగ్ధుడై, తంజావూరులో బృహధీశ్వరాలయం నిర్మించారని ప్రతీతి. ఈ కైలాసనాథార్ దేవాలయంలో కొలువుదీరిన 58 ఉపాలయాలను కూడా దర్శించవచ్చు. ఈ కైలాసనాథార్ దేవాలయంలో శివరాత్రి  విశేషంగా జరుగుతుంది.  

కైలాసనాథార్ దేవాలయం లో పరమేశ్వరుడు 16 పట్టల లింగంగా దర్శనమిస్తాడు. 16 పట్టలు  16 కళలు అని ప్రతీతి.  ఈ శివలింగం చాలా పెద్దగా ఉంటుంది.

ఇక్కడ ఉన్న మరో ప్రత్యేకత శివలింగం పక్కనే ఉన్న బిలం లో కి వెళ్ళి బయటకి వస్తే మరుజన్మ  ఉండదు. బిలం లో శివలింగానికి  ప్రదక్షిణగా తిరిగేటప్పుదు  ""ఓం నమః శివాయ"  అని పారాయణ చేస్తూ బిలం లో నుంచి బయటకి  రావాలి.

ఈ బిలం లోకి సులభంగానే  వెళ్ళవచ్చు కాని బయటకి రావటం కొంచెం కష్టం. పాకుతూ రావాల్సి ఉంటుంది. కైలాసనాథార్ దేవాలయం పురావస్తు శాఖ వారి ఆధీనంలో ఉంది.  

  

19, జనవరి 2012, గురువారం

శ్రీఏకామ్రేశ్వర్ ఆలయం కాంచీపురం


కాంచీపురంలో ఏకామ్రేశ్వర్ ఆలయం, శివకంచిలో నెలకొన్న సుప్రసిద్ధ పుణ్యక్షేత్రాలలో ఒకటిగా విరాజిల్లుతుంది.  ఈ క్షేత్రం యొక్క పురాణగాధని ఆలయ ప్రవేశ ద్వారం వద్ద ఎడమ వైపున చిత్రాలలో  తిలకించవచ్చు. ఆలయం ద్రావిశైలిలో నిర్మితమై చూపరులను విశేషంగా ఆకట్టుకొంటుంది. ఆలయం చాలా విశాలంగా శిల్పకళా   సౌందర్యానికి  పెట్టింది పేరుగా  మంత్రముగ్ధులను చేస్తుంది. కోనేరు చాలా విశాలంగా ఉంటుంది. ఇక్కడ వెయ్యిస్థంభాల మండపం ప్రధాన ఆకర్షణ. కాంచీపురాన్ని పల్లవులు రాజధానిగా చేసుకొని పరిపాలించారు. 

ఈ ఆలయంలో పరమేశ్వరుని కైంకర్యానికి సదా సిధ్దగా ఉండే నందీశ్వరుడు  చాలా  పెద్దగా  నయన మనోహరంగా దర్శమిస్తాడు.  ఇక్కడ కొలువైన ఏకామ్రేశ్వరుడు పంచభూత స్థలాలలో ఒకటైన పృథ్వి లింగంగా పూజలందుకొంటున్న ఏకాంబరేశ్వరుడుకు మల్లె తైలంతో విశేషంగా అభిషేకం జరుగుతుంది.

ఏకామ్రేశ్వర్ కోవెలలో 3500 సంవత్సరాల అతిపురాతనమైన  మామిడి వృక్షం నాలుగు కొమ్మలతో ఉండేది. ఒక్కొక్క కొమ్మ మామిడి పండ్లు ఒక్కో రుచితో ఉండేవి. ఈ  మామిడి వృక్షం యొక్క నాలుగు కొమ్మలు నాలుగు వేదాలకు ప్రతీతి.


ఇక్కడ పరమేశ్వరుని శివలింగం సైకత లింగం. ఈ శివలింగాన్ని పార్వతిదేవి సైకతంతో  చేసారని  ప్రతీతి. ఈ మామిడి వృక్షం కిందే పార్వతి దేవి , తపోకామాక్షి గా పరమేశ్వరుని కోసం తపస్సు చేసి, పరమేశ్వరుని  ప్రత్యక్షం చేసుకొని వివాహం చేసుకొంది. అయితే ఇంతటి ప్రాసశ్థ్యం కలిగిన ఈ  మామిడి వృక్షం యొక్క కాండం మాత్రమే చూడగలం ప్రస్తుతం . ఈ  మామిడి వృక్షం యొక్క కాండాన్ని అద్దాల పెట్టెలో ఉంచి దేవాలయంలో భద్రపరిచారు.

ఇప్పుడు  పురాతన మామిడి వృక్షం  స్థానంలో,దేవస్థానం వారు కొత్తగా మరో మామిడి వృక్షం  నాటారు. మరో ఆసక్తికరమైన విశేషం ఏమిటంటే, ఈ మామిడి వృక్షం క్రింద పార్వతిపరమేశ్వరులు, పార్వతిదేవి కుమారస్వామిని ఒడిలో కూర్చోపెట్టుకొని వధూవరులుగా దర్శనమిస్తారు. ఇక్కడే మనం తపోకామాక్షిని కూడా దర్శించవచ్చు.

ఈ ఆలయంలో మనం 16 పట్టలు ఉన్న శివ లింగాన్ని దర్శించవచ్చు. 16 పట్టలు 16 కళలకు ప్రతీతి అంటారు.

ఇదే ఆలయంలో నటరాజస్వామి చిద్విలాస రూపాన్ని దర్శించవచ్చు. ఇక్కడ శ్రీమన్నారాయణుడు అర్చా ముర్తిగా కొలువుదీరి ఉన్నాడు.