14, జనవరి 2012, శనివారం

గోదా కళ్యాణ వైభోగమే


తమిళనాడులో శ్రీవిల్లిపుత్తూరు  లో విష్ణుచిత్తులకు తులసి వనం లో దొరికిన అపురూప పెన్నిధి గోదాదేవి. గో అంటే జ్ఞానం, దా  అంటే యిచ్చేది.

గోదాదేవి కి ఆండాళ్ మరియు కోదై అని కూడా నామములు కలవు. గోదాదేవి భూదేవి అవతారం అని ప్రతీతి.
గోదాదేవి ప్రతి రోజూ ఉద్యానవనం లో పూలు కోసి, మాలలు అల్లితే, ఆ మాలలు విష్ణుచిత్తులు శ్రీవిల్లిపుత్తూరు ఆలయం లో శ్రీకృష్ణ పరమాత్మకి సమర్పించేవారు. ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మ వటపత్రశాయి గా కొలువుదీరి ఉన్నారు.

శ్రీ గోదాదేవి రోజూ మాలలు అల్లి, వాటిని అలంకరించుకొని, బావిలో చూసుకొని,  ఆ  మాలలు విష్ణుచిత్తులు కి యిస్తే, విష్ణుచిత్తులు ఆమాలలను  ఆలయంలోని శ్రీకృష్ణ పరమాత్మకి అలంకరించేవారు.  ఒకరోజు మాలలకు శిరోజాలు ఉండటాన్ని  గమనించిన   విష్ణుచిత్తులు, మహా అపరాధం జరిగిందని మాలలు శ్రీస్వామి వారికి అలంకరించకుండా బెంగపడతాడు.

"నాకు గోదా అలంకరించుకొని సమర్పించిన మాలలే అత్యంత ప్రీతికరం, నాకు ఆ మాలలే అలంకరించండి" అని  శ్రీకృష్ణ పరమాత్మ విష్ణుచిత్తుల కలలో కనిపించి కోరతాడు . 

శ్రీ గోదాదేవి మహావిష్ణువును భర్తగా పొందదలచి, విష్ణుచిత్తులుని శ్రీమహావిష్ణువును యొక్క రూపాలను వర్ణించమని కోరుతుంది. విష్ణుచిత్తులు శ్రీమహావిష్ణువును రూపాలను వర్ణిస్తాడు. అన్ని శ్రీమహావిష్ణువు రూపాల వర్ణనలను విన్న గోదా,  శ్రీరంగం లో కొలువుదీరిన రంగనాథ స్వామిని పరిణయమాడాలని నిశ్చయించుకొంటుంది. 

కొలువైతివా రంగశాయి | హాయి | కొలువైతివా రంగశాయి ||

కొలువైన నిను చూడ కలవా కన్నులు వేయి 
కొలువైతివా రంగశాయి |

సిరి మదిలో పూచి తరచి రాగము రేపి 
చిరునవ్వు విరజాజులేవోయి | ఏవోయి |
కొలువైతివా రంగశాయి |

సిరి మోవి దమ్మికై మరి మరి క్రీగంట
పరచేటి ఎలదేటులేవోయి ఏవోయి 
కొలువైతివా రంగశాయి |

ఔరా ఔరౌరా | ఔరా  ఔఔరా ||
రంగారు జిలుగు బంగారు వలువ సింగారముగ ధరించి
వురమందు తులసి సరులంతు కలసి మణి అంతముగ వహించి
సిస్తైన నొసట కస్తూరి బొట్టు ముస్తాబుగ ధరించి
ఎలదమ్మి కనుల ఎలదేటి కొనల తులలేని నెనరులుంచి         

జిలి బిలి  పడగల శేషాహి తెలిమల్లె శయ్య శయనించి
ముజ్జగములు మోహంబున తిలకింపగ పులకింపగ 
శ్రీ రంగ మందిర నవసుందరా పరా |
                                                               
కొలువైతివా రంగశాయి | హాయి | కొలువైతివా రంగశాయి ||
కొలువైన నిను చూడ కలవా కన్నులు వేయి 
కొలువైతివా రంగశాయి ||

శ్రీరంగనాథున్ని పరిణయమాడటానికి  శ్రీభాగవతం లో విరచించినట్లు గోపికలు సలిపిన కాత్యాయనీ వ్రతాన్ని, శ్రీవిల్లిపుత్తూరునే బృందావనంగా,  శ్రీవిల్లిపుత్తూరు ఆలయాన్నే నందుని నివాసంగా, శ్రీవిల్లిపుత్తూరులో కొలువుదీరిన  దేవదేవుడినే  శ్రీకృష్ణగా, తన నేస్తాలనే   గోపికలుగా తలచి గోదాదేవి ధనుర్మాసంలో తిరుప్పావై పాశురాలని గానం చేస్తుంది.

గోదాదేవి ధనుర్మాసం  30 రోజులు, రోజుకొక పాశురం చొప్పున నెల రోజులు   ప్రవచించిన 30 పాశురాలే తిరుప్పావై పాశురాలు గా ప్రసిద్ధి  చెందాయి. నాలుగు  వేదాలసారాన్ని  తిరుప్పావై  పాశురాలలో క్రోడీకరించి,  సర్వం శ్రీరంగనాథుని మయం  అని తెలియచేసింది.

అన్ని వైష్ణవ దేవాలయాల్లోనూ  ధనుర్మాసం లో తిరుప్పావై పాశురాలు గానం చేస్తారు.  శ్రీకృష్ణదేవరాయలు  తిరుప్పావైని ఆముక్తమాల్యద గా తెలుగులో అనువదించారు. 

"గోదాదేవిని వధువుగా అలంకరించి శ్రీరంగం ఆలయానికి తీసుకొనిరా !! గోదాదేవిని పరిణయమాడతాను" అని రంగనాథుడు విష్ణుచిత్తులుకి కలలో కనిపించి చెప్తాడు.

విష్ణుచిత్తులు గోదాదేవిని వధువు అలంకరణలో, పల్లకీలో,  రంగనాథుని సన్నిధికి శ్రీరంగం తీసుకొని వస్తాడు. గోదా దేవి రంగనాథుని అర్చా మూర్తి  దగ్గరకి వెళ్ళి, రంగనాథునిలో అంతర్లీనమౌతుంది.

అన్ని వైష్ణవ దేవాలయాల్లోనూ  ధనుర్మాసం లో ,  గోదాదేవిరంగనాథుల వివాహం అంగరంగ వైభవంగా జరుగుతుంది.



రంగ రంగ రంగ పతి రంగనాధా నీ |
సింగారాలె తరచాయ శ్రీ  రంగ నాధా ||

పట్ట పగలే మాతో పలుచగ నవ్వేవు |
ఒట్టులేల టలిగిరించు వడి నీ మాటలు వింటె |
రట్టడివి మేరమీరకు రంగనాధా |
రంగనాధా శ్రీ రంగనాధా ||

కావేటి రంగమున కాంతపై పాదాలు సాచి |
రావు పోవు ఎక్కడికి రంగ నాధా |
శ్రీ వేంకటాద్రి మీద చేరి నను కూడితివి |
ఏవల చూచిన నీవేయిట రంగనాధా ||

రంగనాధా శ్రీ రంగనాధా

పన్నిద్దరు ఆళ్వారులలో గోదాదేవి ఒకరు. గోదాదేవి వలనే ధనుర్మాసానికి అంతటి విశిష్టత కలిగిందేమో !!! ధనుర్మాసం అంటేనే గోదాదేవి, తిరుప్పావై పారాయణ.

1 కామెంట్‌: