19, జనవరి 2012, గురువారం

శ్రీఏకామ్రేశ్వర్ ఆలయం కాంచీపురం


కాంచీపురంలో ఏకామ్రేశ్వర్ ఆలయం, శివకంచిలో నెలకొన్న సుప్రసిద్ధ పుణ్యక్షేత్రాలలో ఒకటిగా విరాజిల్లుతుంది.  ఈ క్షేత్రం యొక్క పురాణగాధని ఆలయ ప్రవేశ ద్వారం వద్ద ఎడమ వైపున చిత్రాలలో  తిలకించవచ్చు. ఆలయం ద్రావిశైలిలో నిర్మితమై చూపరులను విశేషంగా ఆకట్టుకొంటుంది. ఆలయం చాలా విశాలంగా శిల్పకళా   సౌందర్యానికి  పెట్టింది పేరుగా  మంత్రముగ్ధులను చేస్తుంది. కోనేరు చాలా విశాలంగా ఉంటుంది. ఇక్కడ వెయ్యిస్థంభాల మండపం ప్రధాన ఆకర్షణ. కాంచీపురాన్ని పల్లవులు రాజధానిగా చేసుకొని పరిపాలించారు. 

ఈ ఆలయంలో పరమేశ్వరుని కైంకర్యానికి సదా సిధ్దగా ఉండే నందీశ్వరుడు  చాలా  పెద్దగా  నయన మనోహరంగా దర్శమిస్తాడు.  ఇక్కడ కొలువైన ఏకామ్రేశ్వరుడు పంచభూత స్థలాలలో ఒకటైన పృథ్వి లింగంగా పూజలందుకొంటున్న ఏకాంబరేశ్వరుడుకు మల్లె తైలంతో విశేషంగా అభిషేకం జరుగుతుంది.

ఏకామ్రేశ్వర్ కోవెలలో 3500 సంవత్సరాల అతిపురాతనమైన  మామిడి వృక్షం నాలుగు కొమ్మలతో ఉండేది. ఒక్కొక్క కొమ్మ మామిడి పండ్లు ఒక్కో రుచితో ఉండేవి. ఈ  మామిడి వృక్షం యొక్క నాలుగు కొమ్మలు నాలుగు వేదాలకు ప్రతీతి.


ఇక్కడ పరమేశ్వరుని శివలింగం సైకత లింగం. ఈ శివలింగాన్ని పార్వతిదేవి సైకతంతో  చేసారని  ప్రతీతి. ఈ మామిడి వృక్షం కిందే పార్వతి దేవి , తపోకామాక్షి గా పరమేశ్వరుని కోసం తపస్సు చేసి, పరమేశ్వరుని  ప్రత్యక్షం చేసుకొని వివాహం చేసుకొంది. అయితే ఇంతటి ప్రాసశ్థ్యం కలిగిన ఈ  మామిడి వృక్షం యొక్క కాండం మాత్రమే చూడగలం ప్రస్తుతం . ఈ  మామిడి వృక్షం యొక్క కాండాన్ని అద్దాల పెట్టెలో ఉంచి దేవాలయంలో భద్రపరిచారు.

ఇప్పుడు  పురాతన మామిడి వృక్షం  స్థానంలో,దేవస్థానం వారు కొత్తగా మరో మామిడి వృక్షం  నాటారు. మరో ఆసక్తికరమైన విశేషం ఏమిటంటే, ఈ మామిడి వృక్షం క్రింద పార్వతిపరమేశ్వరులు, పార్వతిదేవి కుమారస్వామిని ఒడిలో కూర్చోపెట్టుకొని వధూవరులుగా దర్శనమిస్తారు. ఇక్కడే మనం తపోకామాక్షిని కూడా దర్శించవచ్చు.

ఈ ఆలయంలో మనం 16 పట్టలు ఉన్న శివ లింగాన్ని దర్శించవచ్చు. 16 పట్టలు 16 కళలకు ప్రతీతి అంటారు.

ఇదే ఆలయంలో నటరాజస్వామి చిద్విలాస రూపాన్ని దర్శించవచ్చు. ఇక్కడ శ్రీమన్నారాయణుడు అర్చా ముర్తిగా కొలువుదీరి ఉన్నాడు.  

2 కామెంట్‌లు:

  1. అది ఏకాంబర కాదు.ఏకామ్ర .ఆమ్ర=మామిడి ;అంబర=వస్త్రం ,ఆకాశం అని నానార్థాలు.ఏకామ్రేశ్వరస్వామి ఆంటే ఒక్క మామిడి చెట్టు కింద వెలసిన స్వామి అని అర్థం.మిగతా మీరు రాసిందంతా కరెక్టే.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ధన్యవాదాలు కమనీయం గారు!!
      సదా వెన్నంటి ఉంటారని ఆశిస్తూ

      తొలగించండి