20, జనవరి 2012, శుక్రవారం

శ్రీకైలాసనాథార్ దేవాలయం కాంచీపురం


పరమేశ్వరుడు కాంచీపురంలో కొలువుదీరిన సుప్రసిద్దమైన  దేవాలయాలలో  కైలాసనాథార్ దేవాలయం అత్యంత విశిష్టమైనది . 

కైలాసనాథార్ దేవాలయ ప్రాంగణం చాలా విశాలంగా, ప్రశాంత వాతవరణంలో  నెలకొనిఉంది.  ఈ దేవాలయం దేవశిల్పి  విశ్వకర్మే స్వయంగా పరమశివుడు కొలువుదీరటానికి నిర్మించాడేమో అన్నట్లు అసమాన శిల్పకళా సౌందర్యంతో అలరారుతుంది. శిల్ప సౌందర్యాన్ని రాశిగా పోస్తే ,అది  కైలాసనాథార్ దేవాలయం అంటే అతిశయోక్తి  కాదేమో.


లయ ప్రాంగణంలో శిల్పాలు  నయనమనోహరంగా ఉంటాయి.      ప్రాంగణం  లో ఉన్న శిల్పాలు సైకత శిల్పాలు. దేవాలయ ప్రాంగణంలో గోడలపై కొలువుదీరిన "శివలీలలు"  ఆనందసాగరంలో ఓలలాడిస్తాయి.  ఈ దేవాలయం 8వ శతాబ్ధంలో నిర్మించినప్పటికి,  యీ  అపురూప శిల్పాలు  యిప్పటికి చెక్కుచెదరకుండా నిలచిఉండటం, ఆకాలంలో శిల్పుల కళా నైపుణ్యానికి, శాస్త్ర విజ్ఞానానికి, కళా వైభవానికి ప్రతీకలు . కైలాసనాథార్ దేవాలయం కాంచీపురం సిగలో పల్లవులచే తురమబడిన కలికితురాయి.


పల్లవ రాజైన రాజసింహ   కైలాసనాథార్ దేవాలయం నిర్మించారు. ఈ దేవాలయం  ద్రావిడ శైలిలో  నిర్మించబడింది.  


రాజరాజ చోళ కైలాసనాథార్ దేవాలయం దర్శించి, అత్యంత ముగ్ధుడై, తంజావూరులో బృహధీశ్వరాలయం నిర్మించారని ప్రతీతి. ఈ కైలాసనాథార్ దేవాలయంలో కొలువుదీరిన 58 ఉపాలయాలను కూడా దర్శించవచ్చు. ఈ కైలాసనాథార్ దేవాలయంలో శివరాత్రి  విశేషంగా జరుగుతుంది.  

కైలాసనాథార్ దేవాలయం లో పరమేశ్వరుడు 16 పట్టల లింగంగా దర్శనమిస్తాడు. 16 పట్టలు  16 కళలు అని ప్రతీతి.  ఈ శివలింగం చాలా పెద్దగా ఉంటుంది.

ఇక్కడ ఉన్న మరో ప్రత్యేకత శివలింగం పక్కనే ఉన్న బిలం లో కి వెళ్ళి బయటకి వస్తే మరుజన్మ  ఉండదు. బిలం లో శివలింగానికి  ప్రదక్షిణగా తిరిగేటప్పుదు  ""ఓం నమః శివాయ"  అని పారాయణ చేస్తూ బిలం లో నుంచి బయటకి  రావాలి.

ఈ బిలం లోకి సులభంగానే  వెళ్ళవచ్చు కాని బయటకి రావటం కొంచెం కష్టం. పాకుతూ రావాల్సి ఉంటుంది. కైలాసనాథార్ దేవాలయం పురావస్తు శాఖ వారి ఆధీనంలో ఉంది.  

  

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి