18, జనవరి 2012, బుధవారం

శ్రీ కపిలేశ్వరలింగం కపిలతీర్థం



తిరుపతిలో జలజలా స్వచ్ఛంగా  జాలువారే  ప్రశస్థ  తీర్థ రాజమే  కపిలతీర్థం. ఇక్కడ పరమేశ్వరుడు కపిలేశ్వరుడుగా కామాక్షి సహితంగా  కొలువుదీరి  ఉన్నాడు. ఈ కపిల లింగం  కపిలమహర్షిచే పాతళంలో పూజలందుకొన్నది. ఒకానొక కారణం చేత ఈ కపిలలింగం పాతాళం నుంచి భూలోకానికి వచ్చింది. 

ఇక్కడ కొలువుదీరిన శివలింగం కపిలమహర్షిచే పూజలందుకోబడి, కపిలమహర్షి పేరుమీద కపిలలింగంగా పిలవబడుతుంది.  ఇక్కడ పరమేశ్వరుడు పార్వతి సహితంగా కపిలమహర్షికి దర్శనమిచ్చాడని ప్రతీతి.  ఈ ఆలయంలో కపిలేశ్వరుడు, కామాక్షి, వేణుగోపాలస్వామి, వినాయకుడు, సుబ్రమణ్య స్వామి  కొలువుదీరి  ఉన్నారు.

కపిలతీర్థంలో కార్తీక పౌర్ణమి రోజు మధ్యాహ్నం సమస్త తీర్థాలు కొలువై ఉంటాయి అంచేత ఆ సమయంలో ఈ తీర్థంలో స్నానం ఆచరిస్తే విశేష ఫలం కలుగుతుంది. 12 గంటల నుంచి 12 గంటల 10 నిమిషాల వరకు, కేవలం 10 నిమిషాలు మాత్రమే సమస్త తీర్థాలు యీ కపిలతీర్థంలో కొలువుదీరి ఉంటాయి.తిరుమలలో నెలకొన్న 108 తీర్థాలలో,  యీ  తీర్థం విశిష్టమైనది. 

కార్తీక పౌర్ణమి రోజు కపిలేశ్వరునికి విశేషంగా అన్నాభిషేకం జరుగుతుంది.  కూరగాయలు కూడ ఉడికించి, కపిలలింగానికి అన్నాభిషేకం చేసిన అన్నంతో కలిపి, భక్తులకి ప్రసాదంగా వితరణ చేస్తారు.ఈ ప్రసాదం స్వీకరించటానికి భక్తులు విశేషంగా తరలి వస్తారు.     

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవేంకటేశ్వరుడు, వకుళమాలను కపిలతీర్థం  లో స్నానం ఆచరించి కపిలేశ్వరున్ని దర్శించి ఆ తర్వాత నారాయణవనం వెళ్ళి  పద్మావతి శ్రీనివాసుల వివాహం గురించి ఆకాశరాజుతో మాట్లాడమని చెప్తాడు. తిరుమల క్షేత్రపాలకుడు పరమశివుడు.

పూర్వం తిరుమల చేరుకోవటానికి రవాణా  సౌకర్యం అంతగా లేనప్పుడు, మెట్లమార్గం ద్వారా నడచి తిరుపతి వెళ్తూ, కపిలతీర్థంలో స్నానం   అచరించి కాలినడకన తిరుమల వెళ్ళేవాళ్ళు.              


తిరుమల నుంచి అలిపిరి వెళ్ళే అన్ని బస్ లు నంది సర్కిల్ వైపు నుంచే వెళ్తాయి. అక్కడ దిగి కపిలతీర్థం వెళ్ళవచ్చు.  
   








 








కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి