13, జనవరి 2012, శుక్రవారం

శ్రీ వేంకటేశ్వర సుప్రభాత సేవ తిరుమల

తిరుమల లో శ్రీ వేంకటేశ్వర సుప్రభాత సేవ ప్రతి రోజు ఉదయం 2:30 నిమిషాలకు నిర్వహిస్తారు. సుప్రభాత సేవ టికెట్ ఉన్న భక్తులు ఉదయం 2 గంటలకు కి వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 1 లో టికెట్ తనిఖీ చేయించుకొని క్యూ కాంప్లెక్స్ లో ప్రవేశించి, సుప్రభాత సేవకు వెళ్ళటానికి క్యూ లైను మధ్యలో తలుపులు తీసేంతవరకు నిరీక్షిస్తారు.

ఆ సమయం లో స్వామివారి కీర్తనలు కడు రమణీయంగా అహ్లాదకరంగా వినిపిస్తూ ఉంటాయి.

క్యూ లైను మధ్యలో తలుపులు తియ్యగానే అందరూ క్యూ లైను లో ముందుకు వెళ్ళి, మహాద్వారము నుంచి శంఖ నిధి, పద్మ నిధి దాటి, కుడి వైపున గోడమీద వెళ్ళాడుతున్న శ్రీ అనంతాళ్వార్ గునపానికి నమస్కరించి, ముందుకు వెళ్ళి బలిపీఠానికి,  ధ్వజస్థంభానికి నమస్కరించి, ధ్వజస్థంభం మీద కొలువుదీరిన ఊర్ధ్వపుండ్రాలు (తిరునామము) ,సదా శ్రీరామ ధ్యానం లో ముకుళిత హస్తాలతో నిమగ్నమైన హనుమ, ఏడు పగళ్ళు,ఏడు రాత్రులు గోవర్ధన గిరిని తన చిటికెన వేలిపై ఉంచి గోవులను, గోపాలకులని కాచిన నందనందనుడు దేవకీదేవి గారాల పట్టీ అయిన చిన్ని కృష్ణున్ని గాంచి,  వెండి వాకిలి దాటి బంగారు వాకిలి నుంచి లోనికి ప్రవేశిస్తారు.

దేవేంద్రునితో యుధ్ధం చేసి, అమృతాన్ని తెచ్చి, తన తల్లి అయిన వినుతాదేవి కి దాస్య విముక్తి కలిగించిన వైనతేయుడు, సదా స్వామి కైంకర్యానికై సిద్ధంగా ఉండే  ఖగ రాజు గరుడాళ్వార్ కి  వినమ్రంగా నమస్కరించి,

కౌసల్యా సుప్రజా రామా పూర్వా సంధ్యా ప్రవర్తతే ।
 ఉత్తిష్ఠ నరశార్దూల! కర్తవ్యం దైవమాహ్నికం  ।।

ఉత్తిష్ఠోత్తిష్ట   గోవింద ఉత్తిష్ఠ   గరుడధ్వజ ।
ఉత్తిష్ఠ కమలాకాంతా త్రైలోక్యం  మంగళం కురు ।।


సుప్రభాతం వింటూ తల పైకెత్తి చూస్తే బంగారంతో తాపడం చెయ్యబడిన దశావతారాలు, అక్కడే రాతి స్థంభాలలో కొలువుదీరిన దేవతమూర్తులు, పైన కట్టిన  మామిడి తోరణం, ముందుకు చూస్తే ద్వారం పైన పద్మంలో చిరునగవు తో కొలువుదీరిన లక్ష్మిదేవి, నా స్వామి దర్శనం మీకు తప్పక అవుతుంది అని అభయమిస్తున్నట్లు  ఉంటుంది.

శ్రీవేంకటేశ్వర స్వామికి  తెర మాటున అర్చకులు  యిప్పుడు  ఏమి ఉపచారం చేస్తూ  ఉంటారు అని కుతూహలంతో .

హ్మ్ !! వెన్న నివేదిస్తున్నారా!!
కాదు !! పాలు నివేదిస్తున్నారా !!
ఊ !! శ్రీస్వామి నిద్ర లేచారా !!
అని మనస్సు లో పరిపరివిధాలా అలోచిస్తూ,

సుప్రభాతం  పూర్తి అవ్వగానే జయవిజయులని దాటి లోపలికివెళ్ళి శ్రీ వేంకటేశ్వర స్వామి విశ్వరూప దర్శనం ప్రశాంతంగా చేసుకోవటం అధ్బుతం.

ఏదో లోకంలో ఉన్నట్లు గోవిందా గోవిందా అంటూ ప్రశాంతంగా స్వామివారి దివ్య మంగళ రూపాన్ని ఆపాదమస్తకం  దర్శనం చేసుకొని బయటకి వచ్చి, వకుళమాలను దర్శించి, బ్రహ్మ తీర్థం స్వీకరించి, కాసేపు ఆలయ ప్రాంగణంలో కూర్చొని, సంపగి ప్రాకరం వైపు వెళ్ళి ప్రసాదం తీసుకొని, పూల బావి వద్ద ఆరగించి మళ్ళీ మహాద్వారం నుంచి ఆలయం వెలుపలకి వెళ్ళి కాసేపు కూర్చొని, లడ్డు ప్రసాదం తీసుకొని కాటేజీకి వెళ్ళటం గొప్ప అనుభూతి.     

శ్రీ వేంకటేశ్వర స్వామి వారికి ధనుర్మాసంలో సుప్రభాత సేవ రద్దు చేసి, శ్రీ గోదాదేవి  విరచిత తిరుప్పావై ఫాసురాలు గానం చేస్తారు.  అయితే ఈసేవ ఏకాంత సేవగా నిర్వహిస్తారు. పర్వదినాలలో స్వామి వారికి కి సుప్రభాత సేవ ఏకాంత సేవగా నిర్వహిస్తారు.


ప్రతి లోగిలో తెలతెలవారుతుండగానే  శ్రావ్యంగా  వినిపించి, అప్రయత్నంగా మనమూ శృతి  కలిపే శ్రీవేంకటేశ్వర సుప్రభాతాన్ని  విరచించిన ఫ్రతివాది భయంకర ఆణ్ణన్ ఎంతైనా  ప్రాతఃస్మరణీయులు.



2 కామెంట్‌లు:

  1. OM NAMO VENKATESHAYA NAMAHA. YENTHATI KASTHMAYENA OKKA KSHNAM LOO POGATE THANDRI GURUNCHI YENTHA CHEPUKUNA CHALA THAKUWEE. VENKATESHA NAMAM SARVA DOSHA NIVARANAM.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అంతా విష్ణు మాయ. ఆదిశేషునికే వేయి తలతో కీర్తింపశక్యం కాలేదు. విశ్వం అంతా తనే నిండి ఉన్నాడు. ధన్యవాదాలు వేంకటేశ్వర్లుగారు.

      తొలగించండి