కాంచీపురంలో శ్రీమహావిష్ణువు కొలువుదీరిన సుప్రసిద్ధ ఆలయాలలో శ్రీఉలగళంద పెరుమాళ్ ఆలయానికి విశిష్ట స్థానం ఉంది. శ్రీమహావిష్ణువు శ్రీఉలగళంద పెరుమాళ్ గా కొలువుదీరి ఉన్నాడు. ఈ ఆలయం శ్రీ కామాక్షి దేవి ఆలయానికి సమీపంలో ఉంటుంది.
శ్రీఉలగళంద పెరుమాళ్ త్రివిక్రముడు మరియు వామనుడు అని కూడా ప్రసిద్ధి. వామనవతారం శ్రీమహావిష్ణువు యొక్క ఐదవ అవతారం. ఇక్కడ ఆదిశేషునికి మరియు బలి చక్రవర్తికి శ్రీఉలగళంద పెరుమాళ్ దర్శనమిచ్చారు. బలిచక్రవర్తి పరమ విష్ణుభక్తుడు.
శ్రీఉలగళంద పెరుమాళ్ అర్చారూపం చాలా పెద్దగా 35 అడుగుల ఎత్తుతో ఉంటుంది. శ్రీఉలగళంద పెరుమాళ్ ని చూడటానికి రెండు కనులు సరిపోవు. ఈ ఆలయంలో శ్రీఉలగళంద పెరుమాళ్ అమృతవల్లి సహితంగా కొలువుదీరి ఉన్నారు. ఇక్కడ ఉన్న పుష్కరిణి నాగ తీర్థం. శ్రీఉలగళంద పెరుమాళ్ ఎడమ పాదం ఆకాశంపై ఉంటుంది. కుడి పాదం బలిచక్రవర్తి తలపై ఉంటుంది. శ్రీఉలగళంద పెరుమాళ్ ద్విబాహువులతో దర్శనమిస్తారు. రెండు చేతుల కుడి ఎడమలకు చాచి, కుడి చేతి ఒక వేలు, ఎడమ చేతి రెండు వేళ్ళు చూపిస్తూ ఉంటారు.
శ్రీవైష్ణవులకు పరమపవిత్రమైన 108 దివ్యదేశాలలో, శ్రీవరదరాజ పెరుమాళ్ ఆలయం కూడా ఒకటి. ఈ ఆలయంలో వామన జయంతి విశేషంగా నిర్వహిస్తారు.
ప్రహ్లాదుని మనవడైన బలిచక్రవర్తికి దానగుణం పెట్టని అలంకారం. బలిచక్రవర్తి పాతాళలోకం పరిపాలిస్తూ, దేవతలతో యుద్ధం చేసి, దేవేంద్రుడిని పదవీచ్యుడిని చేసి, స్వర్గంపై ఆధిపత్యం సాధిస్తాడు. బలిచక్రవర్తి, అసుర గురువు శుక్రాచార్యుడు సహకారంతో అశ్వమేధయాగం
చేసి ముల్లోకాలపై ఆధిపత్యం సాధించటానికి సిద్ధపడతాడు.
బలిచక్రవర్తి ప్రయత్నానికి ఆటంకం కలిగించటానికి శ్రీమహావిష్ణువు వామనుడుగా అవతరించి, బలిచక్రవర్తికి దగ్గరికి వెళ్ళి మూడు అడుగుల నేల దానం అడుగుతాడు.
"ఓ నృప!! నీ దానగుణం విని మీదు మిక్కిలి సంతసించాను. నేను అడిగినది దానం యివ్వగలవా? " అని ఠీవిగా నిలబడి ఉన్న వామనుడు బలిచక్రవర్తిని అడుగుతాడు.
"ఏమి దానంగా కావాలో కోరుకో!!" దివ్య తేజస్సుతో వెలిగిపోతున్న వామనుడుతో బలి అంటాడు.
"నాకు మూడు అడుగుల స్థలం యివ్వగలవా?" అని వామనుడు అడుగుతాడు.
"అదెంత భాగ్యం!! ఇప్పుడే తీసుకో" అని బలి జల పూర్వకంగా వామనుడుకి దానమివ్వ తలుస్తాడు.
శ్రీమహావిష్ణువు వామనుడు రూపంలో బలి నుంచి దానం స్వీకరించటానికి వచ్చాడని గ్రహించిన అసుర గురువు శుక్రాచార్యుడు, బలిని దానం యివ్వవద్దని కోరతాడు.
వారిజాక్షులందు, వైవాహికములందు
బ్రాణ విత్త మాన భంగములందుఁ
జకితగోకులా గ్రజన్మరక్షణమందు
బొంకవచ్చు, నఘము రాదధిప!
"గురు వర్యా!! దానం యిస్తాను అని వాగ్ధనం చేసిన తర్వాత ఆడితప్పటం సరి కాదు. శ్రీమహావిష్ణువే స్వయంగా వామనుడి రూపంలో దానం స్వీకరించటానికి వస్తే మిక్కిలి సంతసిస్తాను" అని బలిచక్రవర్తి శుక్రాచార్యునితో పలికి, జలసహితంగా 3 అడుగుల నేల దానం చెయ్యటానికి సిద్దపడి జల పాత్రను కరములలోకి తీసుకొంటాడు.
కీడు శంకించిన శుక్రాచార్యులు కందిరీగ రూపందాల్చి జలం పాత్రలోనుంచి జలం బయటకు రాకుండా అడ్డుగా ఉంటాడు. ఇది గ్రహించిన వామనుడు పుల్లతో జలపాత్రలో అడ్డుగా ఉన్న కందిరీగని పొడుస్తాడు. ఆ పుల్ల కందిరీగ రూపంలో ఉన్న శుక్రాచార్యులు ఒక కన్నుకి తగిలి దృష్టి పోతుంది. బలిచక్రవర్తి జల సహితంగా 3 అడుగుల భూమి వామనుడుకి దానం యిస్తాడు.
ఇంతింతై వటుడింతయై మరియు తానింతై నభో వీధి పై
నంతై తోయద మండలాగ్రమున కల్లంతై ప్రభా రాశి పై
నంతై చంద్రుని కంతయై ధ్రువుని పై నంతై మహర్వాటి పై
నంతై సత్య పదోన్నతుండగుచు బ్రహ్మాండాంత సంవర్ధి యై !!
వామనుడు త్రివిక్రముడై ముల్లోకాలు ఆక్రమించేటంతగా ఎదిగిపోయాడు. ఒక అడుగుతో భూమిని, మరో అడుగుతో ఆకాశాన్ని ఆక్రమించి, మూడో అడుగు పెట్టటానికి స్థలం చూపమని వామనుడు బలిచక్రవర్తిని కోరతాడు. బలిచక్రవర్తి మూడో అడుగు తన తలపై పెట్టమని కోరతాడు. త్రివిక్రముడు మూడో అడుగు బలిచక్రవర్తి తలపై మోపి బలిని పాతళలోకానికి తొక్కేస్తాడు.
బ్రహ్మ కడిగిన పాదము
బ్రహ్మము తానెని పాదము
చెలగి వసుధ కొలిచిన నీ పాదము
బలి తల మోపిన పాదము
తలకగ గగనము తన్నిన పాదము
బలరిపు గాచిన పాదము
కామిని పాపము కడిగిన పాదము
పాము తలనిడిన పాదము
ప్రేమతొ శ్రీ సతి పిసికెడి పాదము
పామిడి తురగపు పాదము
పరమ యోగులకు పరి పరి విధముల
పరమొసగెడి నీ పాదము
తిరువేంకటగిరి తిరమని చూపిన
పరమ పదము నీ పాదము


కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి